Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రజా సాధికార సర్వే ఒక వినూత్న కార్య‌క్ర‌మం: చ‌ంద్ర‌బాబు

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌డు ఈరోజు విజ‌య‌వాడ‌లో ప్ర‌జా సాధికార స‌ర్వేని ప్రారంభించారు. అధికారుల‌కు త‌న వివ‌రాల‌ను స్వ‌యంగా తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘ఇది ఒక చరిత్ర‌.. రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌న్నీ తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.. ఇది ఒక వినూత్న కార్య‌క్ర‌మం’ అని అన్నారు. ప్ర‌తీ ఒక్క‌రు సాధికార‌త సాధించాల‌నే ఉద్దేశంతోనే ఈ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌న్నింటికీ ఈ సర్వే ఉప‌యోగ‌ప‌డుతుందని ఆయ‌న తెలిపారు. ‘ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నేరుగా అర్హుల‌కే అందుతాయి.. ఈ స‌ర్వే వ‌ల్ల సామాజిక స్థితిగ‌తులు మెరుగు ప‌డ‌తాయి’ అని చంద్ర‌బాబు అన్నారు. అన్ని వివ‌రాలు తెలిస్తే వాటికి త‌గ్గట్టుగా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ముందుకువెళ‌తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి, కులాల వారికి ఎటువంటి అన్యాయం జ‌ర‌గ‌కుండా ఉప‌యోగప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. స‌ర్వే అనంత‌రం ప్ర‌జా సంక్షేమం కోసం ఓ స్థూల ప్ర‌ణాళికను రూపొందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. అణ‌గారిన వారిని ఆదుకోవ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చంద్రబాబు అన్నారు. ‘ప్ర‌జాసాధికార స‌ర్వే వ‌ల్ల ఆర్థిక‌, సామాజిక ప‌రిస్థితులు తెలుసుకోవ‌చ్చు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన‌వారిని ఎలా పైకి తీసుకురావాలో ఆలోచిస్తా’మ‌ని ఆయ‌న అన్నారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News